Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page

స్వామితో సంభాషణ
(ఆర్థర్‌ ఐసెన్‌బర్గ్‌)

కామకోటి పీఠాధిపులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు మద్రాసు సమీపం నుంబల్‌ గ్రామంలో ఉన్నపుడు నేను వారిని కలుసుకొన్నా. శ్రీవారికి అరవై ఐదేళ్లు ఉంటాయి. ఉపవాసంతో శుష్కించిన శరీరం, పూర్ణవపసమయిన శిరోభాగం, చిబుకముపై అపుడుపుడే వస్తున్న తెల్లని వెంట్రుకలు, తెల్లనికనుబొమలు, కాషాయంతో కప్పుకొన్న దేహం.

ఐతే, ఇవి ప్రధానమూ అంటే కావు. ప్రధానమైనది నైర్మల్యం తొణికిసలాడే వర్చస్సుతో కూడిన ఆయన ముఖం- ముఖాన్నిమించి దీప్తివంతములైన ఆయనకన్నులు, ఆకనులలో ప్రతిబింబించే కరుణా, జాలీ- ఆ రెంటినీ పెనవేసుకొన్న ధీవికాసం, పెదవులపై లలితలలితమైన మందహాసం.

ఆయన యెదుట కూచోగానే అనవరత ప్రశాంతవీచికలలో ఓలలాడే పరమఋషి ముందు కూర్చున్నామన్నభావన నాలో మెదిలింది. మూడున్నరగంటలసేపు ఆయనతో చేసిన సంభాషణతో ఈ భావం భావంగా నిలచిపోక సిద్ధాంతమై పోయింది.

సమావేశంలో నాతోబాటు ఇరువురు ఉన్నారు. ఒకరు స్వామివారివద్ద దీక్ష పుచ్చుకొని స్వామికి పరిచర్యచేస్తూ ఆయనతోబాటు ఉన్న అనంతానందస్వాములు. పూర్వాశ్రమంలో హైకోర్టులో ఉద్యోగం చేసేవారట. సంభాషణ పూర్తి అయ్యేంతవరకూ ఆయన నిలుచునే ఉన్నారు. రెండవ ఆయన నా మిత్రుడు డాక్టరు రాఘవన్‌. ఈ సమావేశం ఏర్పాటుచేసి స్వామి చెప్పినది అనువదించి చెప్పడానికి పూనుకొన్నవారు.

స్వాములవారు, తాను ఇంగ్లీషు చదివి అర్థం చేసుకో కలిగినా ఆ భాషలో మాట్లాడటానికి, సాహసించమన్నారు. ఇంగ్లీషును అర్థం చేసుకోవడానికి వినికిడి. అరవములో సంభాషించిననూ, మధ్యమధ్యలో ఆయన వాడిన ఇంగ్లీషు పదాల ఉచ్చారణమాత్రం నిర్దుష్టంగానే ఉండినది.

స్వాములవారిలో ఒక విశిష్టమైన గుణం గమనించాను. ఒకరు మాట్లాడుతుంటే వారు మధ్యలో అడ్డురారు. ఎవరైనా ప్రశ్నించారంటే- ఆప్రశ్నకు కనీసం ఒక నిముషమన్నా ఆగి, ఆలోచనా పూర్వకంగా కొంతనిరామముతో కూడిన బదులు ఇస్తారు. వారిచ్చిన ప్రత్యుత్తరం గమనిస్తే అది అడిగిన ప్రశ్నను ధారణచేసి ఇచ్చిన సమాధానంగా ఉంటుంది. అంతే కాదు జవాబు క్లుప్తంగానూ, విషయానికి సంబంధించిందిగానూ ఉంటుంది.

మాసంభాషణ చాలవరకు వ్యక్తిగతంగా ఉన్నా, విషయేతరాలను కూడా చర్చించినాము.

ప్ర :- మీ ఉద్దేశంలో ఒక విదేశీయ ప్రభుత్వంలేదా ఒక విదేశీయ సంస్థకు భారతదేశాభ్యుదయం కాంక్షించి చేయగల సాహాయ్యం ఏదై ఉంటుంది?

తమ అలవాటు ప్రకారం స్వాములవారు ఒక నిమిషం ఆగి ఇలా బదులు చెప్పారు.

ఉత్త :- మీ ప్రశ్నకు సమాధానం సహాయం పొందే పక్షంపై ఆధారపడి వుంటుంది. ఈ ప్రశ్న భారత ప్రభుత్వం వారికివేస్తే వారు బహుశా విద్యారంగంలోనో వ్యవసాయరంగంలోనో సహాయం అర్థించవచ్చు. మీరు నన్ను అడుగుతున్నారు కనుక నాజవాబు ఇస్తున్నాను.

''నా ఉద్దేశంలో ఒక విదేశీయ ప్రభుత్వంగానీ, సంస్థగానీ ఈదేశంయొక్క సంస్కృతి విషయంలో సహాయం చేయవచ్చు. నృత్యం, వాఙ్మయం, కళలు, దర్శన శాస్త్రాలూ వీనినిగూర్చి మా దేశంచేసే పరిశోధనల్లో, పరిశ్రమలలో తోడ్పడి దానిలో కృతకృత్యతకు సాయం చేయవచ్చు''.

భారత మహిళల విషయంలో స్వాములవారి అభిప్రాయాలు ఈ కాలానికి అనుగుణంగా లేవు. వారి అభిప్రాయాలతో నేను ఏకీభవించిన లేకపోయినా, ఆ అభిప్రాయాల వెనుక ఉన్న ఉద్దేశాన్ని మాత్రం గౌరవిస్తాను.

స్వాములవారి ఉద్దేశంలో స్త్రీయొక్క ముఖ్యప్రయోజనం గృహసీమలో స్త్రీ గృహిణియై తన భర్త, పిల్లల బాగోగులు చూచుకొని జీవితం గుడుపుతూ, ఏకొలది వ్యవధి మిగిలిఉంటే ఆ సమయం కుటీరపరిశ్రమలలో వినియోగించవచ్చనని స్వామివారు అభిప్రాయ పడుతారు. బాలబాలికలు కలిసి చదవటానికీ పన్నెండేళ్ళపైన బాలికలుబడులలో చదువడానికీ స్వాములవారు సుముఖలుకారు. ఐతే ఈ ఉద్దేశాలు నవభారత లక్ష్యానికి అనుగుణంగా లేవు. ఈ విషయం ఆయనకూ తెలుసు. కానీ స్త్రీకి కలిగే దురవస్థలన్నిటిలోనూ అవిహితంగాఉండంకంటె మించిన దురవస్థ ఏదీలేదని వారి నమ్మక. పెళ్ళికాని పిల్లలకు ఏళ్ళు ఎక్కువయ్యేకొద్దీ వివాహమయ్యే అవకాశాలు సన్నగిల్లుతాయి. అందుచేత కన్యక రజస్వలకాగానే దేశంలోని చట్టం ఎంత తక్కువ వయస్సులో వివాహం ఆమోదించిందో, అంత తక్కువ వయస్సులో పెళ్ళిచేయటం యుక్తం అని వారి మతం. గృహిణులై తమ తమ సంసారాలను చక్కబెట్టుకొంటూ దాంపత్యానురాగంలోసుఖిం చేమహిళలకున్న కృతకృత్యతా భావం పురుషులను అనుకరిస్తూ పురుషులతో సమానంగా ఉద్యోగాలుచేసే స్త్రీలలో మృగ్యమని వారి భావం. శ్రీవారి అభిప్రాయాలు పౌరాణికమైనా భారతమహిళల అభ్యుదయంలో వారి ఆసక్తిని ఎవరూ కాదనలేరు.

భారతదేశంలో జాతియైక్యత గురించి మీ అభిప్రాయమేమన్నాను-దేశంలో రాజకీయపక్షాలు పరస్పరం సుహృద్భావంతో మెలగితే జాతియైక్యతకు అనుకూలంగా ఉంటుందని జాగరూకతతో కూడిన ఆశాభావం ఆయన ప్రకటించారు.

ఈ సమావేశాన్ని ఎదురుచూచి ఒక ప్రశ్న వేయాలని సిద్ధంచేసుకొని వచ్చారు. వారిచ్చిన జవాబుతో స్వామివారు చమత్కరించటంలో కూడా తీసిపోరని తేలింది.

ప్రశ్న :- సరియైనప్రశ్న వేయటమే జ్ఞానోదయానికి ప్రాతిపదిక అని అంటారుకదా! నేనుజ్ఞానినని అనుకొందాం. అప్పుడు నేను మిమ్ములను అడుగవలసిన ప్రశ్నఏది?

నేను ప్రశ్న అడుగుతున్నపుడూ, రాఘవన్‌ అనువదిస్తున్నపుడూ స్వాములవారు చిరునవ్వు నవ్వుతూనే ఉన్నారు.

ప్రశ్నను మరొకసారి అడగవలసినదని రాఘవన్‌ కోరారు. తర్వాత తమ అలవాటు ప్రకారం ఒక నిమిషం ఆగి ఇలా అన్నారు.

మీరు జ్ఞానులే ఐతే ఏప్రశ్నా అడుగరు.

ఈ జవాబువిని నవ్వటం నావంతైంది.

( 6 - 18 )

నిజమే కానీ జ్ఞానంలో అర్భకుడననీ, విచారణలో మొదటి మొట్టులో ఉన్నాననీ అనుకొందాం. అపుడు నేను మిమ్మల్ని ఏమి అడగాలి?

ఆలాంటపుడు నాకర్తవ్యం ఏమిటి? అని అడుగవచ్చు.

ఆ ప్రశ్ననే అడిగానని అనుకోండి. మీ జవాబు?

దానికి వారి జవాబు సందిగ్ధంగా ఉంది.

మీరు ఏత్రోవలో వెడుతున్నారో దానిలోనేవెళ్లండి.

నాస్వభావమూ అంతే. మంచికైనా చెడ్డకైనా నేను జ్ఞానపక్షపాతిని. శ్రద్ధకూ (ఎశషఠ) నాకు చాలాదూరం.

ఔను. అన్ని మార్గాలలోనూ జ్ఞానం మించినది ఏదీ లేదు. నిజానికి ఉన్న మార్గమే అది. భక్తి కర్మలు జ్ఞానానికి ఆనుషంగికాలే. జ్ఞానమార్గంలో భక్తికర్మలు మజిలీలవంటివి. అన్నీ జ్ఞానంలో పరిసమాప్తి కావలసిందే.

ఒకప్రశ్న :- జ్ఞానం ఒకవిధమైన మానసిక అహంకారం-గర్వం-కాదా?

ఔను. 'కానీ మీకు ఈ ప్రశ్న ఎలా ఉదయించింది? మీ బుద్ధి ద్రష్ట అనుమంత విమర్శకుడూ కాకపోతే ఈప్రశ్న ఉదయించదుకదా!

'ఐతే జ్ఞానమార్గంలోఒకడు తానుపురోగమిస్తున్నాడా? ఎక్కడివాడు అక్కడే ఉన్నాడా? లేక వెనుకకు జారిపోతున్నాడా అనే విషయం ఎట్లా తెలుసుకోవటం?'

ఒక్కొక్క సంవత్సరమూ తాము చేసేపనులలో కామకారకమైనవీ, క్రోధకారకమైనవీ- ఎక్కువౌతున్నవా, తగ్గుతున్నవా అని గమనించాలి. తగ్గుతూవస్తే పురోగమిస్తున్నట్లు అర్థం. ఒకే రకంగా ఉంటే నిలకడ అని అర్థం. ఎక్కువౌతూఉంటే నిర్ధిష్ట పథంనుంచీ వెనుకకు జారుతున్నాడని అర్థం.

'ఈ మార్గంలో నిజమైన తృప్తీ-నిజమైన-ఆనందం సౌఖ్యం ఏదైనా ఉందా?'

'చేసే అన్వేషణయే ఆనందమూ-సుఖమూ. ఒక సుఖం పొందినాము అని అంటే అది సుఖంకాదు. సుఖస్వరూపంగా ఉండటమే సుఖం.'

మా సంభాషణలో విషయాంతరాలు వచ్చినా, స్వాములవారు భౌతికశాస్త్ర విషయాలలో చాల ఆసక్తి చూపించారు. భౌతికశాస్త్ర నిర్ణయాలు అద్వైతానికి భిన్నం కాదని శ్రీవారి అభిప్రాయం. ఈవిషయంగా వారు వ్రాయటమూ, చెప్పటమూ జరిగింది.

స్వాములవారు 'మళ్ళా కలుసుకొందాములే' అని అన్నారు. నా అభిలాషా అదే. కాని ఆ ప్రశాంత సంధ్యలో ప్రశాంతమూర్తి ఐన ఆ సంయమీంద్రునితో గడపిన కాలం. నా జీవితంలో ఒక మరపురాని ఘట్టం.


Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page